ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ’ మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రంతి గురైంది. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ‘తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని స్మరించుకున్నారు. ఆయనను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని అవేదన వ్యక్తం చేస్తూ కందికొండ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి హరీశ్ రావు కూడా కందికొండ మృతికి సంతాపం తెలిపారు. ఆయన పాటలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. పలు సినీ సంఘాలు కూడా నివాళి అర్పిస్తున్నాయి.