Telangana chief minister kcr announces half crore compensation to forest rangers srinivasarao
mictv telugu

ఉద్యోగులపై దాడి చేస్తే ఖబడ్దార్.. కేసీఆర్ హెచ్చరిక

November 22, 2022

Telangana chief minister kcr announces half crore compensation to forest rangers srinivasarao

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ చనిపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తూ సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. మృతుడి కుటుంబానికి ఏ లోటూ రానివ్వబోమని, అతని రిటైర్మెంట్ వయసు వరకు జీతభత్యాలు అందుతాయని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.

చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం గుత్తికోయలు దాడి చేయడంతో శ్రీనివాసరావు అనే ఫారెస్ట్ రేంజర్ చనిపోయాడు. పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటడంతో గుత్తికోయలు దాడి చేశారు. గతంలోనూ జిల్లాలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య ఘర్షణలు జరిగాయి. సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటడం వల్ల తాము భూములకు దూరమవుతామని కోయలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారమే తాము మొక్కలు నాటుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోడు భూముల సమస్యకు దశాబ్దాలుగా పరిష్కారం కొనగొనకపోవడంతో తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.