Telangana chief minister kcr Dussehra festival wishes
mictv telugu

దసరా రోజు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి.. కేసీఆర్

October 4, 2022

‘విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దసరా సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్ర సమితి పేరుతో దసరా రోజున(గురువారం) జాతీయ పార్టీ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన పండగ పూట తలపెట్టిన కార్యాలు ఫలించాలని ఆకాంక్షించడం గమనార్హం.

‘‘ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పది. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ స్పూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలి. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి. విజయ దశమి స్పూర్తి ని కొనసాగిస్తాం. ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలి,’ అని కేసీఆర్ పేర్కొన్నారు.