దారిలో దివ్యాంగుడు.. చలించిన కేసీఆర్, వెంటనే ఆదేశాలు - MicTv.in - Telugu News
mictv telugu

దారిలో దివ్యాంగుడు.. చలించిన కేసీఆర్, వెంటనే ఆదేశాలు

February 27, 2020

kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు హైదరాబాద్ టోలిచౌకిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. కాన్వాయ్ వెళ్తోంది. దారిలో ఓ వృద్ధుడు చేతిలో దరఖాస్తు పట్టుకుని కనిపించాడు. అతడు దివ్యాంగుడు కూడా. తనతో గోడు వెళ్లబోసుకోడానికి వచ్చాడని కేసీఆర్ అర్థం చేసుకున్నారు. వెంటనే కారు దిగి  అతని వద్దకు వెళ్లారు. అతని వేదన విని చలించిపోయారు. వెంటనే అతణ్ని ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

సీఎంను సాయం కోసం వేడుకున్న వృద్ధుడి పేరు మహ్మద్ సలీమ్. డ్రైవర్‌గా పనిచేసిన అతడు నాలుగేళ్ల కిందట ఓ భవనంపై నుంచి పడ్డంతో కాలు విరిగింది. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ‘నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు సాబ్. నా కొడుక్కి కూడా ఒంట్లో బాగాలేదు. మీరే మమ్ముల ఆదుకోవాలి’ అని సీఎంను కోరాడు. అతని పరిస్థితిని కళ్లారా చూసిన కేసీఆర్.. అతనికి వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు. ఆమె వెంటనే టోలిచౌకిలోని సలీం ఇంటికెళ్లి వివరాలు సేకరించారు. అతనికి వికలాంగ ధ్రువీకరణ పత్రం ఉండడంతో అక్కడే పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కేటాయించారు. సలీంకు ప్రభుత్వ ఖర్చుతో చికిత్స చేయిస్తామని, కొడుక్కి సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం చేస్తామని  తెలిపారు.