తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు వర్గాలకు వరాల జల్లులు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన తెలంగాణ సెంటిమెంటను మళ్లీ బయటికి తీసుకొచ్చి గత పాలకులను దుయ్యబట్టారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అది గెలిస్తే దేశం అఫ్ఘానిస్తాన్‌లా తయారై ఘోరాలు జరుగుతాయని హెచ్చరించారు. పన్నెండేళ్ల కిందట మానుకోట రాళ్ల దాడి సంఘటను ప్రస్తావించి కలకలం రేపారు.
‘‘ఉద్యమ కాలంలో నేను మహబూబ్‌నగర్‌తోపాటు మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చాను. చాలా దారుణమైన కరువు పరిస్థితులను కన్నీళ్లు పెట్టాను. సగం పూర్తయిన కాలవలు చూసి చాలా బాధపడేవాళ్లం. గోదావరి నదిలో చిల్లర డబ్బులు వేసిన బీడు భూములకు రావాలని ముక్కుకునేవాణ్ని. దేవుడి దయ, అందరి ఉద్యమం, మానుకోట రాళ్ల బలం అన్నీ కలసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్నారు’’ అని కేసీఆర్ అన్నారు.
2011లో ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా మానుకోట వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు రాళ్లతో దాడి చేశారు. రైల్వేస్టేషన్ రణరంగాన్ని తలపించింది. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకోవడం, ఓదార్పు యాత్రలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వ్యతిరేక నినాదాలు చేయడంతో ఆందోళనకారులు ఆగ్రహంతో దాడికి దిగారు.పోలీసుల కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మానుకోట రాళ్లదాడి కీలకం.