మొక్కజొన్నపై మొహమాటం లేకుండా చెప్పండి.. కేసీఆర్  - MicTv.in - Telugu News
mictv telugu

మొక్కజొన్నపై మొహమాటం లేకుండా చెప్పండి.. కేసీఆర్ 

October 13, 2020

Telangana Chief minister KCR on maize crop

రైతులు మార్కెట్ డిమాండ్, గిట్టుబాటు ధరలను దృష్టిలో ఉంచుకుని పంటలు పండించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయ అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేసి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో సీఎం అన్ని జిల్లాల అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో  సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , రైతు బంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ అధికారులు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలన్న సీఎం మార్కెట్లో సరైన ధరలు లభించే పంటల రకాలను ప్రభుత్వమే  నిర్ణయిస్తుందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదే అని చెప్పారు. 

మొక్కజొన్నకు  క్వింటాల్ కు రూ. 800 లేదా రూ. 900 మించి ధర రాకపోవచ్చని, దానికి ఈసారి విరామం ఇవ్వడమే మంచిదని అన్నారు. ‘మక్కలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అనుకూలత లేదు. దానికితోడు కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గించి లక్షలకొద్దీ టన్నులు దిగుమతి చేసుకోవడం, పక్కరాష్ట్రాల్లో మక్కలు తక్కువ ధరలకే లభించడం వంటి అంశాలు మొక్కజొన్న పంటసాగును నిరుత్సాహపరుస్తున్నవి. మక్కలకు గిట్టుబాటు ధర రాదు అని రైతులకు చెప్పండి. ఇందులో మొహమాటానికి పోయి సగం సగం సమాచారం ఇవ్వడం ద్వారా రైతు మొక్కజొన్న పంటవేసి నష్టపోయే ప్రమాదమున్నది. వానాకాలం మాత్రమే కాదు యాసంగిలో కూడా మొక్కజొన్న పంటకు మద్ధతు ధర వచ్చే పరిస్థితి లేదు. క్వింటాలుకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లోపే ధర పలికే పరిస్థితి వున్నదనే విషయాన్ని రైతుకు స్పష్టం చేయండి, అయినా మక్కలు పండిస్తం అంటే.. ఇక రైతుల ఇష్టం ’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.