తొలి యాక్షన్ హీరో తెలంగాణవాడు కావడం గర్వకారణం.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తొలి యాక్షన్ హీరో తెలంగాణవాడు కావడం గర్వకారణం.. కేసీఆర్

September 27, 2022

తెలుగు చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోకముందే తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ బాలీవుడ్‌లో అగ్ర హీరోగా రాణించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. జయరాజ్ 113వ జయంతి(బుధవారం) సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ జయరాజ్ అని అభివర్ణించారు. భారతీయ సినిమా తొలి దశలో ప్రారంభమైన మూకీల నుండి టాకీల వరకు సాగిన పైడి ప్రస్థానం గొప్పదని, భారతీయ వెండి తెర పై మొట్ట మొదటి “యాక్షన్ హీరో” పైడి జైరాజ్ కావడం తెలంగాణకు గర్వ కారణమని పేర్కొన్నారు.

తనదైన నటనాకౌశలంతో పాటు, దర్శకునిగా, నిర్మాతగా రాణించి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నజయరాజ్ తెలంగాణ సినిమా రంగానికి మూల పురుషుడని సీఎం కొనియాడారు. హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం పలు జాతీయ భాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచారని సీఎం అన్నారు. ఆయన సేవలకు గుర్తుగా, రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలోని సమావేశమందిరానికి ‘ పైడి జై రాజ్ ప్రివ్యూ థియేటర్’ గా పేరు పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ యువత సినిమా పరిశ్రమలో పలు విభాగాల్లో గొప్పగా రాణిస్తోందని, భవిష్యత్తులో తెలంగాణ సినిమా రంగం మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.