Telangana: Chiranjeevi movie scene repeat..Medical for dead pregnant woman
mictv telugu

తెలంగాణ: చిరంజీవి సినిమా సీన్ రిపీట్..మృతి చెందిన గర్భిణికి వైద్యం

September 8, 2022

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని ఓ సీన్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు రిపీట్ చేశారు. మృతి చెందిన గర్భిణికి వైద్యం చేశారు. మెరుగైన చికిత్సను అందిస్తున్నామని, ఆమె కోలుకుంటోందని మధ్య మధ్యలో చెబుతూ, బంధువులను నమ్మించారు. చివరికి తమ ప్రయత్నం ఫలించలేదని, ఆమె మృతి చెందిదని చెప్పారు. దాంతో అనుమానం వచ్చి, మృతురాలి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో అసలు విషయం బయటికి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్ది సేపటికి తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె మృతి చెందింది. దాంతో ఆ వైద్యులు అసలు విషయం చెప్పకుండా, మెరుగైన చికిత్స అందించాలని అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాంతో ఆ ఆసుపత్రి వైద్యులు..ఆమెకు వైద్యం అందుతోందని, ఆమె కోలుకుంటోందని  చెప్పారు. కొద్దిసేపటి తరువాత ”మేము చాలా ప్రయత్నం చేశాం. కానీ ఫలితం దక్కలేదు. ఆమె మృతి చెందింది” అని తెలియజేశారు. దాంతో అనుమానం వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. పరిస్థితిని గమనించిన ఆమనగల్లు ఆసుపత్రి వైద్యులు.. బాధితురాలి కుటుంబానికి రూ. 8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఒప్పందపత్రం కూడా రాసిచ్చారు.

ఇక, మెగస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూరు’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అప్పటికే మ‌ృతి చెందిన ఓ వ్యక్తిని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చి ‘డాక్టర్ గారూ ఉన్నట్టుండి మా అన్నయ కిందపడిపోయాడు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు. మా అన్నయ్య బతికించండి’ అంటూ చిరంజీవి డాక్టర్లను బతిమాలుతాడు. దాంతో వైద్యులు అతడిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి, మృతి చెందాడని తెలిసిన కూడా డబ్బుల కోసం ఆశపడి, వైద్యం చేస్తున్నట్లుగా హడిహుడి చేస్తారు. మధ్యమధ్యలో ఏం ఫర్వాలేదు అంటూ చెబుతూ, చివరికి మృతి చెందాడని చెప్తారు. ఇదే సీన్ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో జరగటం సంచలనంగా మారింది.