ఏడాదిలోపు జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు..సీఎం కేసీఆర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఏడాదిలోపు జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు..సీఎం కేసీఆర్‌

October 24, 2019

Telangana cm kcr about journalists home lands

ఈరోజు ప్రకటించిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

వంద శాతం హైదరాబాద్‌లో ప్రతీ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు వచ్చేలా చేసే బాధ్యత తనదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సరిగ్గా రాలేదన్నారు. పెద్ద స్థాయిల్లో ఉన్న జర్నలిస్టులకు కూడా స్థలాలు రాలేదని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం కేటాయించనన్ని నిధులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు సంక్షేమ నిధులు అండగా నిలుస్తున్నాయన్నారు. సంవత్సరంలోపు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇవ్వడమే కాకుండా.. మంచి హౌసింగ్‌ స్కీం ప్రవేశపెట్టి ఇళ్ళు కట్టుకునేట్లు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్‌లో కూడా జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించాలనుకుంటున్నట్లు తెలిపారు.