రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని, తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులను, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను అందించాలని సూచించారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేయాలన్నారు. అలాగే పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం చేయాలన్నారు.
లోతట్టు ప్రాంతాలు, అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. ఇకపై అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి పోకుండా ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని ఆదేశించారు. ఇండ్లపై హై టెన్షన్ లైన్లు పోయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైన్ల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Hon'ble CM Sri K. Chandrashekar Rao conducted review on the situation in the state due to heavy rains and resultant floods. pic.twitter.com/DxR2IXyno0
— Telangana CMO (@TelanganaCMO) October 15, 2020