పీకే నా ఫ్రెండ్, కలిసి పని చేస్తే తప్పేంది? - కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

పీకే నా ఫ్రెండ్, కలిసి పని చేస్తే తప్పేంది? – కేసీఆర్

March 21, 2022

kkk

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ పాలనను తీవ్ర స్థాయిలో విమర్శించారు. 8 ఏళ్లుగా దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..‘పీకేతో కలిసి పనిచేస్తే తప్పేంది? మంచిగా సర్వేలు చేస్తాడు. 12 రాష్ట్రాల్లో పని చేసిన అనుభవం ఉంది. జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉంది కాబట్టి, ప్రత్యామ్నాయ శక్తి కోసం కలిసి ప్రయత్నిస్తున్నాం. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఈడీ, సీబీఐ కేసులు పెడతారని బెదిరిస్తుండ్రు. కేసీఆర్ వీటికి భయపడేవాడైతే 15 ఏళ్లు తెలంగాణ ఉద్యమం చేసేటోడా? మేం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మేం భయపడం. రైతులకు మద్ధతు ధర వచ్చేవరకు మోడీ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వను. 11 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి కుదురుతుంది. కానీ, ధాన్యం కొనుగోలుకు 11 వేల కోట్లు లేవా?’ అంటూ ప్రశ్నించారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారం లేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ‘పోయిన సారి అన్ని పథకాలు మధ్యలో ఉన్నందున ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ఈ సారి ఆ అవసరం లేదు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 వరకు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుంది. 25 రోజుల తర్వాత ఓ సర్వే రిపోర్టు బయటపెడతా. అందులోని అంశాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. కరోనా వల్ల దేశంలో 15 లక్షల ఉద్యోగాలు పోయాయి. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి బీజేపీకి మనసొప్పదు. కానీ, తెలంగాణలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి కోర్టు కేసులు ఎదురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామ’ని వివరించారు.