గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. వాన పడుతున్నప్పటికీ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరిన ముఖ్యమంత్రి ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం వెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతి పూజ నిర్వహించారు. వంతెన పైనుంచి గోదావరి పరిసరాలను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రాచలంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా ఈరోజు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా అశ్వాపురం మండలం, బట్టీల గుంపులో వరద బాధితులను పరామర్శిస్తున్నారు. అలాగే పాములపల్లిలో గోదావరి ముంపునకు గురైన ఇండ్లను గవర్నర్ తమిళసై పరిశీలిస్తున్నారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మరీ.. వరద ప్రాంతాల్లో గవర్నర్ పర్యటిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఉలిక్కి పడ్డారు: బండి సంజయ్
ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకుని సాయం చేయాలనే ఉద్దేశంతోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించగానే సీఎం కేసీఆర్ ఉలిక్కిపడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గవర్నర్ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించిన తర్వాతే సీఎం ఏరియల్ సర్వేకు బయల్దేరారని విమర్శించారు.