తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న సభ ఇదే కావడం గమనార్హం. తొలుత ఈ సభను ఢిల్లీలో నిర్వహించాలని భావించినా.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మంను ఇందుకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను ఆహ్వానించారు. కేజ్రీవాల్, భగవంత్‌మాన్, అఖిలేష్‌లు అంగీకారం తెలపగా… కేరళ సీఎం ఈరోజు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
ఖమ్మంలోనే ఎందుకంటే..
ఖమ్మం జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో సీఎం కేసీఆర్ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన ప్రాంతమని భావిస్తున్నట్టు తెలిసింది. పక్క రాష్ట్రం ఏపీలో ఇటీవలే బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ పార్టీ శాఖను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పైగా ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు బలం ఉంది. ఇటీవలి మునుగోడు ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులతో పొత్తు కుదిరింది. దీనికి తోడు అక్కడ పార్టీలో వర్గ విభేదాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ బలాన్ని చాటేందుకు ఖమ్మంలో ఆవిర్భావ సభను నిర్వహించాలని సీఎం నిర్ణయించుకొన్నట్లు తెలిసింది.
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం
ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఈ నెల 12న భద్రాద్రి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆరోజు ఉదయం తొలుత మహబూబాబాద్‌కు వెళ్లి అక్కడ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల మధ్య రూ.45 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు భద్రాద్రి జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.