కేసీఆర్ శుభవార్త.. ఆర్టీసీ కార్మికులు రేపు హ్యాపీగా చేరండి..  - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ శుభవార్త.. ఆర్టీసీ కార్మికులు రేపు హ్యాపీగా చేరండి.. 

November 28, 2019

Telangana cm kcr on rtc strike and workers issues 

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, వారే చెప్పుడు మాటలు విని మోసపోయారని సీఎం కేసీఆర్ అన్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు రేపు ఉదయం సంతోషంగా, షరతుల్లేకుండా విధుల్లో చేరాలని, వారు తెలంగాణ బిడ్డలని చెప్పారు. ఈ రోజు ఆర్టీసీ సమ్మె, ధాన్యం, సాగునీరు అంశాలపై కేబినెట్ సమావేశం నిర్వహించిన ఆయన తర్వాత విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నామని, ఒక కి.మీకి 20 పైసలు పెంచుకునే అధికారాన్ని సోమవారం నుంచి ఆర్టీసీకి ఇస్తున్నామని తెలిపారు. 

సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘వారు మా బిడ్డలు, వారిని మా కడుపులో పెట్టుకుంటం . కార్మికులు బతకాలి. ఆర్టీసీకి రేపు వంద కోట్ల రూపాయలు ఇస్తాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పొట్ట నింపినం గాని వారి పొట్టలు కొట్టలేదు.. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల, ప్రతిపక్షాల మాటలు నమ్మి చెడిపోయారు. అనాలోచితమైన సమ్మె. దీనికి పూర్తి బాధ్యత వారిదే. విపక్షాలు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. విధుల్లో చేరండి అని ఇదివరకే చెప్పాం.. కానీ మీరు వినలేదు. అందుకే జీతాలు పోయినయ్. రోడ్డున పడ్డారు. టెన్షన్‌ను గురయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కార్మికులపై జాలి చూపారు.  వారిని ఆదుకోమన్నారు.ఈ క్షణం లేబర్ కోర్టుకు పోతే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ తర్వాత మీ పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కోసం ఆరాటపడ్డం తప్పు కాదని, అయితే క్రమశిక్షణ ఉల్లంఘన సరికాదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై డిపో నుంచి ఐదుగురిని ప్రగతి భవన్‌కు పిలిపించి స్వయంగా మాట్లాడతానని చెప్పారు.  

రాష్ట్ర ప్రజల కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని కేసీఆర్ వివరించారు. ‘అంగన్ వాడీ, హోం గార్డులకు అత్యధిక జీతాలు మన రాష్ట్రంలోనే ఇస్తున్నాం. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే. బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే..’ అని చెప్పారు. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. ఆర్ అండ్ బీ, చీఫ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ‘సమస్య పరిష్కారం కోసం త్వరలో టెండర్లు పిలుస్తాం.. దీని కోసం రూ. 578 కోట్లు కేటాయించాం. ధాన్యం కొనుగోలుపై కొత్త విధానం కోసం చర్చించాం. రాష్ట్రంలోని ప్రధాన చెరువులను నింపుతున్నాం.. ’ అని వెల్లడించారు. కాగా,  52 రోజులపాటు సాగిన సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక నేతలు ప్రకటించడం తెలిసిందే.