యాదాద్రి ఎఫెక్ట్.. ‘నాగార్జునసాగర్’లోనూ కేసీఆర్ బొమ్మ మాయం
యాదాద్రిలో కొత్తగా నిర్మిస్తున్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని శిలలపై చెక్కిన సీఎం కేసీఆర్, కారు, సర్కారు, పథకాల చిత్రాలు వివాదాస్పదం కావడం తెలిసిందే. దైవ సంబంధ శిల్పాలపై వీటిని చెక్కి అధికార పార్టీ ప్రచారం చేసుకుంటోందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా పెట్ట ఎత్తున వ్యతిరేకత వచ్చింది.
దీంతో యాదాద్రి ఆలయంలోని కేసీఆర్, కారు చిత్రాలను తొలగించారు. దైవ సంబంధ శిల్పాలపై రాజకీయాలకు తావుండ కూడదన్నది సీఎం అభిమతమని, అందుకే వాటిని తొలగిస్తున్నామని అధికారులు చెప్పారు. యాదాద్రిలో మాత్రమే కాకుండా, కేసీఆర్ చిత్రాలను నాగార్జునసాగర్‌లో నిర్మాణ దశలో ఉన్న బుద్ధవన మహా స్తూపంపైనా చెక్కారు. యాదాద్రి వివాదంతో అప్రమత్తమైన సంబంధిత సిబ్బంది బుద్ధవన స్థూపంపై కేసీఆర్ బుద్ధుడికి పుష్పాంజలి ఘటిస్తున్నట్టుగా చెక్కిన చిత్రాన్ని తొలగించారు. ఈ శిల్పాన్ని శిల్పులు తమ ఇష్టప్రకారం చెక్కారా లేకపోతే అధికారులు చెక్కించారా అన్నది తెలియడం లేదు. యాదాద్రి శిల్పులకు సీఎం, టీఆర్ఎస్ చిహ్నాలను చెక్కాలని తాము కోరలేదని, వారంతట వారే చరిత్రను రికార్డు చేయడానికి వాటిని చెక్కారని అధికారులు వివరణ ఇవ్వడం తెలిసిందే.