Telangana CM KCR releases videos alleging BJP tried to poach TRS MLAs
mictv telugu

ఏ ప్రధాని అయిన ఇట్ల చెప్పంగ విన్నమా?: సీఎం కేసీఆర్

November 4, 2022

బీజేపీ దుర్మార్గ‌పు చ‌ర్య‌లను దేశ ప్ర‌జ‌లు, యువ‌త‌, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలన్నారు సీఎం కేసీఆర్. ఇటీవల మొయినాబాద్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై, బయటికొచ్చిన పూర్తి వీడియోపై సీఎం కేసీఆర్‌ నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా .. ఈ ముఠాను ఆపరేట్‌ చేస్తున్నది బీఎల్‌ సంతోష్‌, జేపీ నడ్డా, అమిత్‌షా అని చెప్పారు.. అంత ఓపెన్‌గా చెబుతుంటే ఇంత కన్నా దుర్మార్గం ఏముంటుంది? అని ప్రశ్నించారు సీఎం. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే 8 ప్రభుత్వాలను కూల్చేసిందని… నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ, దిల్లీ, ఏపీ రాజస్థాన్‌ అని.. వీడియోలో తెలిపినట్లు వివరించారు. దీన్ని రాజ‌కీయం అంటారా? అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్క‌డ మౌనం పాటించారు కాబ‌ట్టి 8 ప్ర‌భుత్వాలు కూలిపోయాయని, తెలంగాణ చైత‌న్య‌వంత‌మైన గ‌డ్డ కాబ‌ట్టి.. ఈ రాక్ష‌సుల కుట్ర‌ను బ‌ద్ద‌లు కొట్టామన్నారు సీఎం కేసీఆర్‌.

బెంగాల్‌కు సంబంధించి ‘దీదీ ఆప్‌కే పార్టీకే చాలీస్‌ ఎమ్మెల్యే మేరే టచ్‌మే హై’ అని స్వయంగా ప్రధాన మంత్రే చెప్తున్నారు. ఓ ప్రధాన మంత్రి ఈ విధంగా చెప్పొచ్చా? గత ప్రధాన మంత్రులెవరైనా తమతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు 40 మంది 50 మంది టచ్‌లో ఉన్నారని చెప్పంగ విన్నమా? అని కేసీఆర్ అన్నారు. ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తామంటున్నారు. ఈ విధానం కొనసాగితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని, ప్రధానే ఇలా ఉంటే మిగతావారు ఎలా ఉంటారో ఆలోచించాలన్నారు.