వైఎస్ దుర్మార్గుడు.. బాబు గుండెలపై గుద్దాడు.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్ దుర్మార్గుడు.. బాబు గుండెలపై గుద్దాడు.. కేసీఆర్

October 5, 2018

పాలమూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు పాలమూరును ఎండబెట్టి, పోతిరెడ్డిపాడుకు బొక్కపెట్టారని అన్నారు. నిజామాబాద్, నల్గొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా వనపర్తి‌లో శుక్రవారం భారీ సభ నిర్వహించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు పట్టిన చీడపురుగు కాంగ్రెస్ అని అన్నారు.  

rrr

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు కరువు దూరం చేయాలనే ఉద్దేశంతో 40మంది రిటైర్డ్ ఇంజినీర్లతో నదులపై సర్వే చేయించామని, వారి చెప్పినట్లు ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేపట్టామని తెలిపారు. ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం.. నీళ్లు ఎలా వస్తాయో చూపిస్తామని రమ్మంటే.. కాంగ్రెస్ నేతలు పారిపోయారు’ అని విమర్శించారు.

‘వైఎస్ ఏపీకి నీళ్లు తరలించుకుపోతే.. కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు ? అసెంబ్లీకి మాట్లాడటానికి వస్తారా గోలీలు ఆడటానికి వస్తారా ? ఆంధ్రా పాలకులకు సంచులు మోసి బతికారు. కాంగ్రెస్ నేతలకు తెలివిలేదు. అవగాహన లేదు రాజశేఖర్ రెడ్డి ఓ దుర్మార్గుడు. ఈ జిల్లాకు చెందిన చిన్నారెడ్డి పోతిరెడ్డిపాడు తవ్వుడు కరెక్టే.. తెలంగాణకు నష్టం లేదని పత్రికల్లో వ్యాసాలు రాశాడు.  పోతిరెడ్డిపాడు విషయంలో చిల్లర మంత్రిపదవి కోసం కుక్కకు బొక్కేసినట్లు తోకాడించాడు. శ్రీశైలానికి బొక్కపెట్టి హంద్రీనీవాకు నీళ్లు తరలించుకుపోతే.. డీకే అరుణ హారతులు పట్టింది. మా దగ్గర వీడియోలు ఉన్నాయి..’ అని మండిపడ్డారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌పై కూడా తీవ్రంగా మండిపడ్డారు. ‘చంద్రబాబు ఛీ ఛీ నీతో పొత్తా.. బతికుండగా అది జరగదు. మహాకూటమి అంటూ తెలంగాణలో పొత్తులు పెట్టుకుంటున్నావు. రా.. నీ దమ్ము ఏందో.. నా దమ్మ ఏందో చూసుకుందాం’ అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు.

చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకుని గుండెల మీద గుద్దాడని విమర్శించారు. ‘దత్తత తీసుకుని ఏం చేశాడు? గుండెల మీద గుద్ది.. పునాది రాళ్లు పాతాడు. శిలాఫలకాలు వేశాడు. పనులు చేయలేదు. ఇన్నేళ్లు కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఈన గాచి నక్కల పాలవుతుంది’ అని హెచ్చరించారు.