మూడు రోజుల్లో యూరియా, నేరుగా పల్లెలకే:కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎరువుల పంపిణీపై ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్షణమే రైతులకు యూరియా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో డిమాండ్‌కు తగినంత యూరియా అందజేయాలన్నారు.
వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న యూరియా స్టాక్‌ను రైళ్లు, లారీల్లో తెప్పించి నేరుగా గ్రామాలకే పంపాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల రవాణా విషయమై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో సీఎం కేసీఆర్ మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీల ద్వారా యూరియా పంపడానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత యూరియా డిమాండ్ రావడానికి గల కారణాలను వ్యవసాయశాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో యూరియా కోసం లైన్లో నిల్చొని మహిళా రైతు కుప్పకూలడం పట్ల పట్ల కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.