ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో ఈ విషయంపై చర్చించారు. మంతనాల కోసం ప్రగతి భవన్ వెళ్లాలనుకున్న ఆమె ఏమైందో ఏమోగాని చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ఫోన్లో తండ్రిని సంప్రదించారు. గురువారం తమ ముందు హాజరు కావాలని ఈడీ పంపిన నోటీసుల గురించి కవిత తండ్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం.. ఈ విషయంలో భయపడాల్సిన పనే లేదని భరోసా ఇచ్చారు.. ‘‘నీ వెంట పార్టీ ఉంది. ఎవరికీ భయపడొద్దు. బీజేపీ కక్షసాధింపును కలసి కట్టుగా ఎదుర్కొందాం. చట్టాలకు సహకరిస్తూ నీ నిర్దోషిత్వాన్ని నిరూపిద్దాం,’’ అని ఆయన చెప్పినట్లు సమాచారం. తండ్రితో మాట్లాడిన అనంతరం కవిత ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించాలనే డిమాండుతో ఆమె ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనుండడం తెలిసిందే.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని రెండుసార్లు ఎన్నికల మేనిఫెస్టోల్లో హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆమె దుయ్యబడుతున్నారు. మార్చి 13 నుంచి జరిగే పార్లమెంట్ ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని కోరుతున్నారు.