Telangana: CM KCR to inaugurate classes at 8 new govt medical colleges Today
mictv telugu

ఒక్కరోజే 8 మెడికల్ కాలేజీలు.. ప్రారంభించనున్న కేసీఆర్

November 15, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒక్కరోజే 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి వర్చువల్‌గా ఒకేసారి తరగతులను ప్రారంభించనున్నారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌ కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ తొలి విద్యాసంవత్సరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ కలను సాకారం చేసే దిశగా అతిపెద్ద అడుగు పడబోతున్నది. ఈ 8 కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

దేశ వైద్యరంగంలో తెలంగాణ నూతన విప్లవానికి శ్రీకారం చుడుతోందని… దేశ చరిత్రలో ఇదో అరుదైన సందర్భమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం వరకు కేవలం 5 ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. 1946లో ఉస్మానియా, 1956లో గాంధీ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా… 1959లో వరంగల్లో కాకతీయ వైద్యకళాశాలను ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత 2008లో ఆదిలాబాద్‌ రిమ్స్‌, 2012లో నిజామాబాద్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. కేవలం ఎంబీబీఎస్ 850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే సూప‌ర్ స్పెషాలిటీ వైద్యసేవ‌ల‌ను పేద‌లకు చేరువ చేయ‌డంతో పాటు వైద్యవిద్య అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రం ఆవిర్భవించిన తొలి నాళ్లలోనే మహబూబ్‌ నగర్‌, సిద్దిపేటలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి దశలో నల్గొండ, సూర్యాపేటలోనూ ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పాటైన నాలుగు కళాశాలలతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యకళాశాలల సంఖ్య తొమ్మిదికి చేరింది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా పెరిగింది. తాజాగా ఇప్పుడు మరో 8 కొత్త కాలేజీలను ప్రారంభించనున్నారు కేసీఆర్.