Telangana CM KCR to visit Bihar today, national politics on key agenda
mictv telugu

నేడు బిహార్‌కు సీఎం కేసీఆర్.. నీతీశ్‌ కుమార్‌తో భేటీ

August 31, 2022

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు బిహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:15 గంటలకు పాట్నాకి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన ప్రకారం గాల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈనేపథ్యంలో సికింద్రాబాద్‌ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి భోజనం చేస్తారు.

ఆ తరువాత సైనిక కుటుంబాలు, అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక భేటీలో పాల్గొనున్నట్లు సమాచారం. ఇక, తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్, నితీశ్ చర్చించే అవకాశం వుంది. అయితే.. ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీశ్ మళ్లీ తిరిగి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, 2024 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఇటీవల దేశ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు ఎలాంటి చర్చలు జరుపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.