తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్ ద్వారా కొండగట్టులోని జేఎన్టీయూ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు వచ్చిన సీఎం కేసీఆర్ కు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవితతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లు పుష్పచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొన్నాక అర్ఛకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో భక్తులకు దర్శనాలు రద్దు చేశారు
స్వామివారి దర్శనం అనంతరం కొండగట్టు మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు సీఎం కొండగట్టు టూర్ సందర్భంగా పోలీసులు అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాత్రి నుంచే భక్తులకు దర్శనాలను బంద్ చేశారు. కొండ కింద షాపులను పోలీసులు మూసి వేయించారు. ఇటీవల కొండగట్టు ఆలయ అభివృద్ధి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.