telangana Cm Kcr Will Visit To Bihar To Meet Nitish Kumar tomorrow
mictv telugu

సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ఖరారు?

August 12, 2022

దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి ప్రణాళికలు రచిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన ఇప్పటికే చర్చలు జరిపారు. మంబై వెళ్లి శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ నేత శరద్ పవార్ తో మంతనాలు సాగించారు. బెంగళూరులో జేడీఎస్ అధినేత, దేశ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ కూడా కేసీఆర్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమని తెలిపారు. సమాద్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోనూ పలుసార్లు సమావేశమయ్యారు కేసీఆర్. తాజాగా బీహార్ ముఖ్యమంత్రితోనూ చర్చలు జరుపుతుండటం ఆసక్తిగా మారింది.

సీఎం కేసీఆర్ శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో బీహార్‌లోని పాట్నాకు బయలుదేరనున్నారు. రాత్రి అక్కడే బస చేసి, ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశముంది. ఈ క్రమంలోనే వారితో గల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

అయితే పర్యటనకు సంబంధించి ఇంకా అధికారక ప్రకటన ప్రగతి భవన్ నుంచి రాలేదు. అయితే ఈనెల 14న సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. వికారాబాద్ లో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభిస్తారని షెడ్యూల్ వచ్చింది. అయితే కేసీఆర్ వికారాబాద్ పర్యటన ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళుతున్నందునే వికారాబాద్ టూర్ వాయిదా పడిందని తెలుస్తోంది.