మక్కలపై కేసీఆర్ అసంతృప్తి, అయినా శుభవార్త  - MicTv.in - Telugu News
mictv telugu

మక్కలపై కేసీఆర్ అసంతృప్తి, అయినా శుభవార్త 

October 23, 2020

Telangana CM to hold review meet on crop purchase and farming.jp

మక్కలపై అసంతృప్తి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరిందని, అయినప్పటికీ రైతులు మక్కల సాగు చేశారని అసంతృప్తి వ్యక్తంచేశారు. వాస్తవానికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదని కేసీఆర్ తెలిపారు. అయినా రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. గత వేసవికాలం పంటలో 9 లక్షల టన్నుల మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిందని.. దీనికోసం రూ. 1668 కోట్లు ఖర్చు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ మక్కలకు బయట మార్కెట్లో ధర లేకపోవడం వల్ల వేలం వేయాల్సి వచ్చిందని అన్నారు. 

దీంతో కేవలం రూ.823 కోట్లు మాత్రమే వచ్చాయని.. మార్క్ ఫెడ్‌కు మొత్తంగా 845 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. క్వింటాలుకు రూ.1,760 చొప్పున ధర చెల్లించి మార్క్ ఫెడ్ మక్కలను కొన్నదని అన్నారు. ‘సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి క్వింటాలుకు రెండు వేల రూపాయలు ఖర్చు అయింది. కానీ వేలంలో క్వింటాలుకు కేవలం 1,150 రూపాయలు మాత్రమే వచ్చింది. క్వింటాలుకు 850 రూపాయల నష్టం వచ్చింది. మక్కలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ లేకపోవడంతోనే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరింది. నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల తదితర జిల్లాల్లో పసుపుకు అంతర పంటగా కొద్ది పాటి ఎకరాల్లో మక్కలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని, వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా కొంత మంది రైతులు మక్కలు సాగుచేశారు. మక్కలకు మద్దతు ధర రాదని తెలిసినా సాగు చేసి నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎవరూ అడగక ముందే, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల భూమల వద్ద లక్ష కల్లాల నిర్మాణం చేపట్టింది.ఇన్ని పనులు చేసినా రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండలేక మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది’ అని కేసీఆర్ వెల్లడించారు.