తెలంగాణ పోలీసులకు రేవంత్ క్షమాపణ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ పోలీసులకు రేవంత్ క్షమాపణ

February 19, 2022

03

మాటిమాటికీ అరెస్టవుతున్న టీపీసీసీ చీఫ్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం తెలిసిందే. పోలీసులు ఉన్నది ఇందుకేనా, నిరసన తెలిపే హక్కు లేదా అంటూ ఆయన అటు ప్రెస్ మీట్లలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ విమర్శలు సంధిస్తున్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గాడిదలకు బర్త్ జరపడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డకోవడంతో ఆయన ట్విటర్లో గాడిద ఫొటో పెట్టి పోలీసులపై మండిపడ్డారు. ’పోలీసులు బానిసలుగా మారారు. డీజీపీకి బలుపా?’ అని కూడా అన్నారు. అయితే పోలీసులుగా తాము చెయ్యాల్సిన పని తాము చేస్తున్నామని, నిమిత్తమాత్రులమని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆయన వారికి క్షమాపణ చెప్పారు. ‘పోలీసులపై వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చింది.. కానీ అలా మాట్లాడకుండా ఉండాల్సింది’ అని ఆయన అన్నారు.

రేవంత్ శనివారం మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాననడం టీ కప్పులో తుఫాన్ వంటిదని పేర్కొన్నారు. ‘కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ది భిన్నత్వంలో ఏకత్వం. ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ.. అన్ని పరిస్థితులు సర్థుకుంటాయి’ అని అన్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చిన్నజీయర్ స్వామి, రామేశ్వరరావు నిర్మించిన ఆలయాలకు ఇచ్చిన విలువ.. సమ్మక్క జాతరకు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ మేడారం జాతరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.