మెడికల్ సీట్లలో టీఆర్ఎస్ నేతల దందా.. గవర్నర్‌కు రేవంత్ ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

మెడికల్ సీట్లలో టీఆర్ఎస్ నేతల దందా.. గవర్నర్‌కు రేవంత్ ఫిర్యాదు

April 23, 2022

తెలంగాణలోని మెడికల్ కాలేజీల పీజీ సీట్ల వ్యవహారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముందుకు చేరింది. అధికార టీఆర్ఎస్ నేతలు, కాలేజీల యజమానులు సీట్ల కేటాయింపులో దందాకు పాల్పడ్డారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆమెకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు కాలేజీలు సీట్లను బ్లాక్ చేసి, భారీ మొత్తానికి అమ్ముకుంటున్నాయని, ఇందులో మంత్రుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. మంత్రులు మ‌ల్లారెడ్డి, పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ఎమ్మె్ల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర రెడ్డిల పేర్లను ఆయన ప్రస్తావించారు.

‘నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగుల‌ను ఆస‌రా చేసుకుని ఏటా రూ. వంద కోట్లు మేర సీట్ల‌ను బ్లాక్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్ర‌యివేటు క‌ళాశాల‌ల్లో సీట్ల కోసం ధ‌ర‌ఖాస్తు చేయించ‌డం, సీట్ల కేటాయింపు చేయ‌డం కౌన్సిలింగ్ పూర్త‌య్యిన తరువాత అదే సీటును బ్లాక్‌లో ఇత‌రుల‌కు రెండు నుంచి రెండున్న‌ర‌ కోట్ల‌కు అమ్ముకుంటున్నారు. క‌న్వీన‌ర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు రావాల్సిన సీట్ల‌ను మేనేజ్‌మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్‌లో వైద్య సీట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దందాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. సీబీఐతో దర్యాప్తు జరిపించాలి’ అని రేవంత్ కోరారు.

కాగా ఆయన ఆరోపణలు అబద్ధమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ‘ పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ రేవంత్ రెడ్డి నా మీద గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదులు చేయడాన్ని తీవ్రంగా ఖంఢిస్తున్నా. ఖమ్మంలో గత 20 ఏండ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీ లో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయి. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు జరుగుతున్న కౌన్సిలింగ్ అలాట్‌మెంట్ సమయంలోనే మా కాలేజీలో సీట్లు నిండిపోతుంటాయి..అలాంటప్పుడు మాకు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇది పూర్తిగా నిరాధారం. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే సహించేదిలేదు. ఒక వేళ రేవంత్ రెడ్డి గనక నా కాలేజీలో ఒక్కసీటునైనా బ్లాకు దందా చేసినట్టు నిరూపిస్తే…నా కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తా…ఒకవేళ నిరూపంచలేని పక్షంలో రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. తన ఆరోపణలను వెనక్కి తీసుకోని పక్షంలో చట్టపరమైన చర్యలకు రేవంత్ రెడ్డి సిద్ద పడాలి. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న కాలేజీ ప్రతిష్టను మంటగలిపే దుర్మార్గపు చర్యలను తిప్పికొడుతాం’ అని ఓ ప్రకటనలో తెలిపారు.