కరోనాతో ఇబ్బందిపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్య జనంపై కేసీఆర్ ప్రభుత్వం అదనపు కరెంటు చార్జీల పేరుతో మరింత భారం మోపుతోందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చిరు వ్యాపారులపై పోలీస్ లైసెన్స్ వస్తే వారి పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.
అడిషనల్ కన్య్జూమర్ డెవలప్మెంట్(ఏసీడీ) చార్జీల భారం, పోలీసు లైసెన్స్ పేరుతో వ్యాపారులపై భారం మోపడం అన్యాయమని రేవంత్ ఆక్షేపించారు. ‘‘మీ తొమ్మిదేళ్ల పాలనలో అసమర్థ పాలన, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యం. మీ కుటుంబ అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ వ్యవస్థలు దివాలా తీశాయి. మీ అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారు. గతంలో అభివృద్ధి చార్జీలు, ఎడ్యుకేషన్ సెసు్లు, గ్రీన్స సెస్సుల పేరుతో భారం మోపారు. మళ్లీ రెండు నెలల విద్యుత్ బిల్లుల డిపాజిట్ పేరుతో పేదవాడి జేబుకు చిల్లులుపెట్టడానికి తయారయ్యారు. ఒక వైపు కరోనా, పెట్రోల్ – డీజిల్ – గ్యాస్ ధరల పెరుగుదల, నిత్యావసరాల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉపాధి కరువై, ఉద్యోగాలు పోయి యువత రోడ్డున పడుతున్నారు. ఈ పరిస్థితులలో విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్య తరగతిపై దోపిడీకి తెగబడటం క్షమించరాని విషయం’’ అని రేవంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలంటే పోలీసు లైసెన్స్ తప్పనిసరి అన్న నిబంధన దారుణమని అన్నారు. కరోనాతో వ్యాపారాలు దెబ్బతిని, అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్న చిరు, మధ్య తరగతి వ్యయపారులకు ఇది భారమని ఆవేదన వ్యక్తం చేశారు.