టీఆర్ఎస్‌వి కాపీ-కట్ రాజకీయాలు.. ఉత్తమ్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్‌వి కాపీ-కట్ రాజకీయాలు.. ఉత్తమ్ ఫైర్

January 17, 2020

uttam kumar reddy.

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల తేదీ దగ్గరపడ్డంతో రాజకీయ వేడి పెరిగింది. ఈ ఎన్నికలు న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ ఒక్క సీటును కూడా గెలుచుకోదని టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలు అవకతవకగా సాగుతున్నాయని, అందుకే  కొన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు బేజేపీ ప్రభుత్వానికి సహాయం చేయడానికి సీఏఏ, ఎన్నార్సీలపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్ శుక్రవారం హుజుర్‌నగర్‌లో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

500 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. ‘నోటిఫికేషన్‌కు నామినేషన్ మధ్య వ్యవధి లేకపోవడంతో విపక్షాలు అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోయాయి. వార్డు రిజర్వేషన్ల గురించి టీఆర్ఎస్‌కు ముందుగానే తెలియడంతో లబ్ధిపొందింది’ అని ఆరోపించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిని స్థానిక పోలీసుల సమక్షంలోనే కొట్టారని, దీంతో కొంతమంది అభ్యర్థులు  ఉపసంహరించుకోవలసి వచ్చిందని చెప్పారు. ఎన్నికల అధికారులు అధికారపక్షానికి కొమ్ముకాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే టిఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ హామీలు నీటిపై రాతలుగా మారిపోయాయని, ఆ పార్టీ 2014 నుంచి 500కు పైగా వాగ్దానాలు చేసిందని, వాటిలో కనీసం పదైలనా అమలు చేయాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ తెచ్చిన పథకాలనే కేసీఆర్ ప్రభుత్వం కాపీ కొట్టిందన్న ఉత్తమ్ రూ. 5 భోజన పథకం అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో తాము గెలిస్తే పట్టణాల్లో రోజుకు రెండుసార్లు రూ. 5 భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.