డియర్ కాంగ్రెస్.. దిస్ ఈ టూ మచ్ - MicTv.in - Telugu News
mictv telugu

డియర్ కాంగ్రెస్.. దిస్ ఈ టూ మచ్

October 16, 2018

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీః చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తోంది. మిత్ర పక్షాలకు ఎన్ని సీట్లు ఇస్తామో చెప్పడం లేదు. పైగా కోదండరాంను డిప్యూటీ సీఎంను చేస్తామనే ప్రచారాలు చేస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి  మిత్రులకు సీట్లు ఇవ్వాలనుకుంటున్నదా లేక పోతే ఇలాగే గడిపి చివరకు ఏమీ లేదని తేల్చాలని అనుకుంటున్నదా అనే విషయం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకే అర్థం కావడం లేదు.

రెండు రోజులకో నాయకుడు పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. ఏదో విషయం తేల్చుతామని అంటున్నారు. తర్వాత  మరుసటి రోజే  పొత్తులపై  సమావేశాలుపెడుతున్నారు. కానీ ఎటూ తేల్చడం లేదు. మిత్ర పక్షాలు అడిగిన సీట్లలో ఎంతో కొంత మేర సర్దుబాటు చేసుకునే ప్రయత్నమే చేయడం  లేదు.

కాంగ్రెస్ కూటమిలో  కోదండరాంకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ప్రజలకు సంకేతాలు పంపిస్తున్నారు. కానీ ఆయన అడిగినన్ని సీట్లు మాత్రం ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ, సిపిఐలు  సీట్ల  సర్దుబాటు విషయంలో పెద్దగా మాట్లాడటం లేదు. కానీ కోదండరాం పరిస్థితి వేరు. ఆయన తాను అక్కడ లేను అని చెప్తే కూటమి కూలిపోవడం ఖాయం.

పైగా అక్కడున్న  పార్టీలనునాయకులను తెలంగాణ ప్రజలు అంతగా పట్టించుకుంటారనే గ్యారెంటీ ఏమీ లేదు. జనసమితిని వదల లేరు, అలాగని దగ్గర పెట్టుకుంటే ఆయన అడిగినన్ని సీట్లు ఇవ్వనూ లేరు. అందుకే  కాలయాపన అనే చర్చ కూడా జరుగుతున్నది.  కొంత మంది కాంగ్రెస్ నాయకులు మాత్రం కోదండరాం పార్టీ తమతో ఉంటేనే ఎన్నికల్లో లాభిస్తుందని లేక పోతే తమకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.Telangana Congress continued log jam over seat sharing for alliance parties as TJS and TDP demands more seat to contest in upcoming assembly Electionsఆయన ప్రాధాన్యత గురించి ఢిల్లీ పెద్దలకూ తెలుసు కాబట్టి కొంత మంది నాయకుల వల్లనే జాప్యం జరుగుతున్నదని మరి కొంత మంది నాయకులు అంటున్నారు. జనసమితిని నిర్లక్ష్యం చేస్తే గనుక కూటమి మునిగిపోవడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ ఆశలు ఆవిరైపోతాయని అంటున్నారు.

పార్టీలోని కొంత మంది నాయకులకు టికెట్ల సర్దుబాటు విషయంలో లెక్క తేలక పోవడం వల్లనే ఇలా జరుగుతున్నదని అంటున్నారు. 90 సీట్లకు కాంగ్రెస్ పార్టీ పరిమితం అయితే మిత్రులకు  సర్దుబాటు చేయడానికి వీలు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకులు  100 సీట్ల వరకు తామే పోటీ చేద్దామని అంటున్నారు.  కొద్ది రోజులుగా అంతా తమకే అనుకూలంగా ఉందనే  వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి ఇక ఎవ్వరితోనూ పని లేదనే ధోరణిలో కొంత మంది కాంగ్రెస్ నాయకులకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ జనసమితి విషయంలో ఇంకో రెండు రోజులు ఆలస్యం  చేస్తే గనుక  కూటమి మనుగడ ఇబ్బందుల్లో పడుతుందని, జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యనాయకులపై ఒత్తిడి పెరుగుతున్నది. పోలింగ్  తేదీ దగ్గర పడుతున్నది, ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రచారం ప్రారంభించలేదు. మరో వైపు కారు పార్టీ అభ్యర్థులు దూసుకు పోతున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటనలోనే కాదు, ప్రచారంలో మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే తేల్చాలని ఇటు మిత్రులు, అటు  కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు.