Telangana Congress leader booked for raping party worker on pretext of marriage
mictv telugu

పార్టీ కార్యకర్తపై తెలంగాణ కాంగ్రెస్ నేత అత్యాచారం..

September 1, 2022

నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు కుంభం శివకుమార్‌ రెడ్డిపై అత్యాచార వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి, అత్యాచారం చేశాడ‌న‌ని ఓ మ‌హిళ ఫిర్యాదు చేయ‌డంతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాగించి, సిటీలోని ఓ హోటల్‌లో తనను రేప్ చేశార‌ని తెలిపింది. ఈ చ‌ర్య‌ల‌ను వీడియో కూడా రికార్డ్ చేశార‌ని ఆమె ఫిర్యాదు చేసింది. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యురాలినని, 2020లో మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి, పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు కూడా నిర్వహించానని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆ మ‌హిళ దుబ్బాక‌లో ఉన్న స‌మ‌యంలో శివ‌కుమార్ రెడ్డి.. అత‌డితో లైంగిక సంబంధం ఏర్ప‌ర్చుకోవాల‌ని చెప్పాడు. ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో దాడి చేసి, ఆ త‌రువాత ఆమె మెడ‌లో ప‌సుపు తాడు క‌ట్టాడు. కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంద‌ని బాధితురాలిని ఓ హోట‌ల్ గ‌దికి పిలిపించాడు. అక్క‌డికి వెళ్లిన త‌రువాత ఆమె కు మ‌త్తు మందు క‌లిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అనంత‌రం ఆమెపై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. దీనిని అంతా అత‌డు త‌న సెల్ ఫోన్ కెమెరా ద్వారా రికార్డ్ చేశాడు. తన‌తో స‌రిగా ఉండ‌క‌పోతే ఆ ఫొటోల‌ను ఇంట‌ర్నెట్ లో పెడ‌తాన‌ని బెదిరించాడు. బాధితురాలు ఈ విష‌యంలో ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420, 476, 506 కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.