తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పోలీసులు తరచూ అరెస్ట్ చేస్తుండడంపై ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. చేతనైతే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సవాల్ విసిరారు. హామీలు నెరవేర్చకపోతే రోడ్డుక్కెతూనే ఉంటామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ మంగళవారం హుజూరాబాద్ నియోజకర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘పర్యటనకు రెండు రోజుల ముందుగానే అరెస్టు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు నిజంగా ఇటువంటి నిరసనలు ఎదుర్కోవద్దనుకుంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వేలకోట్ల హామీలను అమలు చేయండి. సమస్యలను పరిష్కరించండి. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టి మీరు పర్యటనను విజయవంతంగా చేసుకుందామనుకుంటే పొరపాటే. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అరెస్టు చేసినవారిని విడుదల చేయండి’’ అని పొన్నం డిమాండ్ చేశారు.