టీ కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

టీ కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్.. 

June 2, 2020

Telangana Congress Leaders House Arrest

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల హౌజ్ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఉదయం నుంచే నేతలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు వారి ఇళ్ల వద్ద మోహరించారు. జలదీక్ష పేరుతో మంగళవారం నిరసనకు పిలుపునివ్వడంతో ముందస్తు అరెస్టులు మొదలుపెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నివాసాల వద్ద పోలీసులు మోహరించారు. అయితే దీన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. తాము నిరసన కార్యక్రమం చేయడం లేదని.. పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్‌బీసీ పనులు పరిశీలించాలని మాత్రమే నిర్ణయించామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు ప్రతిపక్ష పార్టీల నేతలు ఇళ్లు దాటకుండా చేయడం నిరంకుశత్వ పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్‌ పార్టీ జలదీక్షకు సిద్ధమైంది. అయితే కరోనా నేపథ్యంలో పోలీసులు దీనికి అనుమతించలేదు. దీంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి 

 ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లేందుకు సిద్ధం కాగా వారిని పోలీసులు అనుమతించకుండా ముందస్తుగా హౌజ్ అరెస్టులు చేశారు. బయటకు రాకుండా భారీగా బలగాలు మోహరించాయి. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పడంతో చివరకు జానారెడ్డి, కోమటిరెడ్డిలకు ప్రాజెక్టు పరిశీలనకు అనుమతి ఇచ్చారు. 

కొడంగల్‌లో రేవంత్ ఇంటికి పోలీసులు  : 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ముందస్తుగా పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతి మార్గంలో ప్రాజెక్టులను కూడా పరిశీలించే అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు.