Telangana Congress MLA Rajagopal Reddy ready for Munugodu by-election
mictv telugu

మునుగోడు ఉప ఎన్నికకు సిద్ధమంటున్న MLA రాజగోపాల్ రెడ్డి

July 30, 2022

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు దిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆహ్వానించినా ఆయన వెళ్లలేదు. ఆదేశాల మేరకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ వేర్వేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయి బుజ్జగించేందుకు ప్రయత్నించారు.

ఉత్తమ్‌, వంశీచంద్‌తో భేటీ అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలి. కేసీఆర్‌ భావిస్తే ఉపఎన్నిక రాదు. ప్రజలు సిద్ధంగా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది. మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణవ్యాప్తంగా చర్చ జరగాలి. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది కావాలి. ఆ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుంది. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తాం. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు. కేసీఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధం. అభివృద్ధి కేవలం, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కే పరిమితం చేశారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుంది. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా. అమిత్‌ షాతో నా రాజీనామా గురించి మాట్లాడలేదు’’ అని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.