కేసీఆర్ ఎఫెక్ట్.. ఏకతాటిపైకి టీకాంగ్రెస్ నేతలు! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ఎఫెక్ట్.. ఏకతాటిపైకి టీకాంగ్రెస్ నేతలు!

March 17, 2018

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఉదయం ఒక నాయకుడు ఒక ప్రకటన చేస్తే మధ్యాహ్నం మరో నాయకుడు దాన్ని ఖండిస్తూ మరో ప్రకటన చేస్తాడు. సాయంత్రం ఇంకో నాయకుడు మొదటి ఇద్దరు నాయకుల ప్రకటనలన ఖండిస్తూ మరో ప్రకటన చేసి అదే పార్టీ అధికార వైఖరి అని అంటాడు. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ నిన్నమొన్నటి వరకు ఇదే పరిస్థితి. అయితే సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుణ్యమా అని హస్తం నేతలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దులపరించుకుని చేతులు కలుపుకుంటున్నారు.

బస్సు యాత్రతో మొదలై..

రాష్ట్రంలో బలంగా వీస్తున్న గులాబీ గాలిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బస్సు యాత్ర నిర్వహించడం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, మరెందరో రెడ్లు, వీహెచ్ వంటి ఇతర సామాజిక వర్గాల నేతలు పొరపొచ్చాలను, శత్రుత్వాలను పక్కనపెట్టి యాత్ర కోసం ఏకమయ్యారు. పాలకులను తీవ్రంగా దుయ్యబట్టారు. అంతవరకు తలొకరు అన్నట్లు వ్యవహరించిన నేతలను బస్సు యాత్ర కలిపే యత్నం చేసింది. కలహాలను మరచిపోయి, దూకుడు పెంచాలన్న హైకమాండ్ ఆదేశాలు కూడా వీరి ప్రవర్తనలో మార్పు తెచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే కలసికట్టుగా సర్కారును ఎదుర్కోవడం తప్ప మరో గత్యంతరం లేదని చేతిగుర్తు నేతలు గుర్తించారు. బస్సు యాత్రంలో ఈ ఐక్యత కాస్త కనిపించింది.

సస్పెన్షన్‌తో పుంజుకుని..  

వచ్చే ఎన్నికల్లో టీకాంగ్రెస్ గౌరవనీయ స్థానాలు పొందలేకపోతే ఏపీలో కాంగ్రెస్‌కు పట్టిన దుర్గతే పడుతుంది. స్థానికంగా తమకు పట్టున్న కోమటిరెడ్డి, సంపత్, రేవంత్, జానారెడ్డి వంటి నేతలు తమ విజయంపై భరోసాతోనే ఉన్నారు. అయితే కేవల వీరు గెలిచినంత మాత్రాన పార్టీ ముఖచిత్రం, భవితవ్యం మారవు. ఎన్నికల్లో సాధ్యమైనంతవరకు ఎక్కువ స్థానాలు గెలిస్తే అధిష్టానం వీరి నాయకత్వాన్ని గుర్తిస్తుంది. దీనికోసం పార్టీని బలోపేతం చేయాలి. అందరూ తలా ఓచేయి వేస్తేనే ‘చేయి’ గట్టిగా పిడికిలి బిగిస్తుంది. అందుకే టీకాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలను పక్కనపెట్టారు. దీనికి తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత, 11మంది ఎమ్మెల్యేల, ఆరుగురు ఎమ్మెల్సీల సస్పెన్షన్ సస్పెన్షన్ కలిసొచ్చింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్‌సెడ్‌తో దాడి చేశారన్న ఆరోపణలపై సర్కారు ఈ చర్య తీసుకోవడం తెలిసిందే.

గులాబీ దాడి..

కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్‌ను ఉతికి ఆరేస్తున్నారు. చరిత్రను తవ్వి, ఆ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయాలను గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్సే రాష్ట్రానికి ప్రథమ శత్రువు అని విమర్శిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కడియం శ్రీహరి తదితరులు కూడా కాంగ్రెస్ వల్లే తెలంగాణ నాశనమైందని అంటున్నారు. జిల్లా, స్థానిక  నేతలు కూడా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుంటారు. ఈ మూకుమ్మడి దాడిని తట్టుకోవాలంటే ఏకం కాక తప్పని స్థితిలో కాంగ్రెస్ పెద్దలు, చిన్నలు సమైక్యతా రాగం ఆపిస్తున్నారు.