సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి.. డిపాజిట్ కూడా దక్కించుకోని కాంగ్రెస్.. - MicTv.in - Telugu News
mictv telugu

సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి.. డిపాజిట్ కూడా దక్కించుకోని కాంగ్రెస్..

November 7, 2022

Telangana: Congress's soldier Palvai Sravanthi bagged sympathy, no votes, lost deposit

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నికలో TRS విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొంది, రాజీనామా చేసి బీజేపీ తరపున బరిలో దిగిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. 686 పోస్టల్‌ బ్యాలెట్లు సహా పోలైన 2,25,878 మొత్తం ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి.

ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్‌ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్‌ దక్కినట్టు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవడంతో పాటు డిపాజిట్ కూడా కోల్పోయింది. పాల్వాయి స్రవంతికి కార్యకర్తలకు పనిచేసినా.. నేతలు ఆశించిన మేర సపోర్ట్ చేయలేదు. అందుకే ఆశించిన ఓట్లు రాలేదు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన స్రవంతికి 27,441 ఓట్లు వచ్చాయి.  ఈసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసినందుకు 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ఇంతకు మించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

డిపాజిట్ సంగతి దేవుడెరుగు..

ఇక తెలంగాణ సంగతి ఇలా ఉంటే.. ఒడిశాలో మాత్రం విచిత్రమైన రికార్డు నెలకొల్పింది కాంగ్రెస్. ధామ్‌నగర్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సమీప నోటా, మరో స్వతంత్ర అభ్యర్ధిపై 12-13 వందల ఓట్ల మెజార్టీ నమోదు చేసింది. ఈ ఎన్నికలో బీజేపీకి 41 వేల వేట్లతో విజయం వరించగా, రెండవ స్థానంలో బిజూ జనతాదళ్ నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం 1556 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతనికంటే..ఓ స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ.. సమీప నోటా కంటే దాదాపు 12 వందల ఓట్ల ఆధిక్యం సాధించడం విశేషం. దేశంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి ఇదీ. డిపాజిట్ సంగతి దేవుడెరుగు..మరీ ఇంత అత్యల్పంగానా అని ఆశ్చర్యపోతున్నారు జనాలు.