వలస కూలీల వద్ద లంచం తీసుకున్న కానిస్టేబుల్ రవీంద్రపై వేటు
సందట్లో సడేమియా అన్నట్టుగా ఓ వైపు పేద కూలీలంతా సొంత ఊళ్లకు కాలినడకన వెళ్తుంటే.. కొంత మంది పోలీసులు వారి వద్ద కూడా దండుకుంటున్నారు. దొరికిన కాడికి లంచం తీసుకుంటూ వేధిస్తున్నారు. ఇలాగే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కానిస్టేబుల్‌పై తెలంగాణ పోలీస్ శాఖ వేటు వేసింది.
పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రవీంద్ర అనే కానిస్టేబుల్ ఇటీవల ఓ వ్యక్తి నుంచి రూ. 500 లంచం డిమాండ్ చేశాడు. ముంబై నుంచి వచ్చాడని తెలిసి అతన్ని విచారించడానికి వెళ్లాడు. ఆ సమయంలో అతన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు తన వద్ద రూ. 300 ఉన్నాయని చెప్పడంతో వాటిని గూగుల్ పే ద్వారా తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణ జరిపించారు. లంచం తీసుకుంది నిజమేనని నిర్ధారించి వేటు వేశారు. పోలీసులు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.