ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి నుంచి జనాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఆ వైరస్ వల్ల కలిగిన కష్టాలను మరిచి.. మళ్లీ సాధారణ జీవనం గడుపుతున్న వారికి.. తాజాగా కొత్త వేరియంట్ భయం వెంటాడుతోంది. బీఎస్ 7 అనే ఈ కొత్త వేరియంట్ కారణంగాఇప్పటికే చైనా, జపాన్, దక్షిణ కొరియా మొదలగు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ అలాంటి పరిస్థితే రానుందా అని ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుత సన్నద్ధతపై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నేడు మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యత, బెడ్స్‌పై మాక్‌డ్రిల్‌లో సమీక్షిస్తారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది. సుమారు 5వేల ఐసీయూ బెడ్లు ఉండగా.. వీటిలో వెంటిలేటర్లు, సీపాప్, బైపాప్, హై ఫ్లో నాసల్ క్యానళ్లు.. తదితర పరికరాలు పనిచేస్తున్నాయా? అనేది కూడా చెక్ చేస్తారు. 6వేల చిన్నారుల పడకల్లో ఆక్సిజన్ సౌకర్యంతో పాటు 1, 875 ఐసీయూ పడకలుండగా.. వాటి పనితీరు సమర్థంగా ఉందా? అనేది కూడా పరిశీలిస్తారు.