లాక్‌డౌన్ కఠినతరం..చర్యలు తప్పవన్న తెలంగాణ సీఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ కఠినతరం..చర్యలు తప్పవన్న తెలంగాణ సీఎస్

March 23, 2020

Lockdown

తెలంగాణలో లాక్‌డౌన్ విధించినా ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎప్పటిలాగే ప్రజలు వాహనాలు వేసుకొని రోడ్లపైకి వచ్చారు. సాధారణ రోజుల కంటే కాస్త తక్కువగా ఉన్నా పెద్దగా మార్పులేమి లేవు. దీంతో సర్కార్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. తొలిరోజు లాక్‌డౌన్ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావద్దని సూచించారు. లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. 

ఇక నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఎవరూ బయటకు రాకూడదని సూచించారు. ఆటోలు, ప్రజా రావాణా వ్యవస్థ పూర్తిగా బంద్ చేసినట్టు వెల్లడించారు. గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఎక్కడైనా ఐదుగురి కన్నా ఎక్కువ మంది గూమిగూడేందుకు అనుమతి లేదని చెప్పారు. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను కూడా అనుమతించమని అన్నారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడి  వారు అక్కడే ఉండిపోవాలని సూచించారు. ఎవరు బయటకు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రావద్దని సూచించారు. వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. బైక్‌పై ఒకరు, కారులో ఇద్దరికి మించి ప్రయాణించరాదని అన్నారు. మూడు కిలోమీటర్లకు మించి వాహనాలపై ప్రయాణం చేయరాదని సూచించారు. ఆటో,టాక్సీ యూనియన్లు కూడా సహకరించాలని డీజీపీ కోరారు.