Telangana cuisine specialist Yadamma was humiliated at Hyderabad Novatel
mictv telugu

నోవాటెల్ లోకి ‘నో ఎంట్రీ’.. వంట మాస్టర్ యాదమ్మకు అవమానం

July 2, 2022

హైదరాబాద్ నోవాటెల్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ వంట మాస్టర్ యాదమ్మకు అవమానం జరిగింది. ప్రధానికి తెలంగాణ రుచులు చూపించేందుకు యాదమ్మను పిలిపించారు. ఈ క్రమంలో పాస్ లేదంటూ నోవాటెల్‌లోకి వెళ్లకుండా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో యాదమ్మ తన అనుచరులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు హైదరాబాద్ కు తరలివస్తుండటంతో అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అతిథులకు తెలంగాణ రుచులను వడ్డించనున్నారు. ఇందుకోసం కరీంనగర్ జిల్లాకు చెందిన వంట మాస్టర్ యాదమ్మను పిలిపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

బండి సంజయ్ నిర్వహించే సామూహిక కార్యక్రమాలకు యాదమ్మ చేతి వంటలనే రుచి చూపిస్తారు. చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో పర్వదినాల సందర్భంగా ఏర్పాటు చేసే సామూహిక భోజన కార్యక్రామానికి కూడా యాదమ్మ వంటలు చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అతిథులకు ఆమె చేతి రుచిని చూపించనున్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఆమెను హైదరాబాద్ కు రప్పించుకున్నారు. కొన్ని వంటకాలను చేయించుకున్న బండి సంజయ్ సూచనలు ఇచ్చారు. ఏకంగా దేశ ప్రధానికి తన చేతులతో చేసిన వంటకాలను రుచి చూపిస్తానని ఇంతకు ముందు చెప్పారు.