Telangana: Don't eat panipuri..don't get typhoid
mictv telugu

తెలంగాణ: పానీపూరీ తినకండి..టైఫాయిడ్‌ తెచ్చుకోకండి

July 13, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు ఓ ముఖ్యమైన సూచన చేశారు. రోడ్లపై పానీపూరి వంటి ఆహారాలను తినడం వల్ల ప్రజలు టైఫాయిడ్, డెంగీ, డయేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, కొన్ని రోజులపాటు పానీపూరితోపాటు బయటి ఆహార పదార్ధాలను తినవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ కేసులు ఇప్పటికే 1,184 చేరాయని, గతేడాదితో పోల్చితే ఈసారి భారీగా కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..”నీళ్ల విరేచనాల కేసులు రాష్ట్రంలో 6వేలు, జిగట విరేచనాల కేసులు 600కి చేరాయి. టైఫాయిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మేలో 2,797 కేసులు, జూన్, జులైలో కలిపి మొత్తం 2,752 కేసులు నమోదయ్యాయి. పానీపూరి వంటి బయటి ఆహారాలు తినడం వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. కావున పానీపూరిని తినటం మానేయండి. కరోనా కరోనా కథ ముగిసింది. ఎండమిక్ దశకు చేరుకుంది. సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉంటుంది. కరోనా ఇప్పుడు సీజనల్ వ్యాధిగా మారిపోయింది. అయితే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. అర్హులందరూ టీకా వేసుకోవాలి. కొత్త వేరియంట్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి” అని ఆయన అన్నారు.

రాష్టవ్యాప్తంగా నమోదైన డెంగీ కేసుల్లో హైదరాబాద్‌లో 516, సంగారెడ్డి 97, కరీంనగర్ 84. ఖమ్మం 82, మేడ్చల్ 55, మహబూబ్ నగర్ 54. పెద్దపల్లిలో 40 చొప్పున దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయని, 2019 తర్వాత మళ్లీ 2022లో వీటి పెరుగుదల ఉందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 208 మలేరియా కేసులూ నిర్ధారణ అయ్యాయని, రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్ ప్రభావం పెరిగిందని, సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని శ్రీనివాసరావు వివరించారు.