తెలంగాణ యువకుడికి జాక్‌పాట్ తగిలింది. అదృష్టం తలపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. లాటరీ రూపంలో ఊహించని డబ్బు వచ్చి మీద పడింది. దుబాయ్‌లో కొన్న లాటరీ
టికెట్‌తో రూ.30 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుగూరుకు చెందిన అజయ్ ఓగుల ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల కింద దుబాయ్ వెళ్లాడు. అక్కడ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాటరీలు కొనే అలవాటు ఉన్న అతడు ఇటీవల 15 దిర్హమ్లు( 338 రూపాయలు) పెట్టి రెండు లాటరీలు కొన్నాడు. అందులో ఓ లాటరీ టికెట్‌కి 30 కోట్లు వచ్చింది. భారీ మొత్తం గెలుచుకున్నాడని తెలియగానే అజయ్ ఉబ్బితబ్బిబ్బై పోయాడు.. అతడి కుటుంబ సభ్యులు కూడా ఆనందంలో మునిగిపోయారు.
ఇప్పటికీ తాను జాక్ పాట్ కొట్టినట్టుగా నమ్మలేకపోతున్నానని యువకుడు తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బుతో కొంత కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపాడు. నిరుపేద కుటుంబానికి చెందన తమకు సొంత ఇళ్లు కూడా లేదన్నాడు. ముందుగా తన తల్లికి, సోదరికి ఇల్లు కట్టిస్తానని వెల్లడించాడు. కుటుంబ సభ్యులకు దుబాయ్ చూపిస్తానని పేర్కొన్నాడు. మిగతా డబ్బుతో ఊరు వచ్చి వ్యాపారం చేయనున్నట్లు అజయ్ స్పష్టం చేశాడు.