రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ నేడు(శుక్రవారం) విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూలును విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఈ పరీక్షలను జేఎన్‌టీయూ ఆన్‌లైన్ వేదికగా నిర్వహించనున్నది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ బీ.డీన్ కుమార్ వ్యవహరించనున్నారు.
అయితే ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ అమలు, దరఖాస్తుకు కనీసం 45 శాతం మార్కులొచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించడమా.. లేదా కొనసాగించడమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని గత మూడేళ్ల మాదిరిగానే ఈసారి కూడా తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ నాటికి జీవో రాకుంటే తర్వాత సర్కారు జారీ చేసే జీవోను అనుసరించి వెయిటేజీపై నిర్ణయం ఉంటుందని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ఎంసెట్‌లో ప్రశ్నలు వస్తాయి.