Telangana EAMCET Counseling Schedule Released
mictv telugu

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

August 12, 2022

Telangana EAMCET Counseling Schedule Released

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను ఈరోజు ఉదయం రాష్ట్ర విద్యాశాఖ‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించార‌ని మంత్రి వెల్ల‌డించారు. ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన నేప‌థ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ నెల 21 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో పాటే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుద‌ల చేసింది. మూడు విడ‌త‌ల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 21 నుంచి 29 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్‌కు అవ‌కాశం ఉంటుంది. ఈ నెల 23 నుంచి 30 వ‌ర‌కు విద్యార్థుల ధృవ‌ప‌త్రాల‌ను ప‌రిశీల‌న , ఆగష్టు 23 నుంచి సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్ల ప్రక్రియ కొన‌సాగ‌నుంది. ఇక సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది

సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్ లు, సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన, సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు, అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగనుంది. అక్టోబరు 11 నుంచి తుది విడత(మూడో విడుత షెడ్యూల్) కౌన్సెలింగ్, అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన, అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు, అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి.