పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం నుంచి అల్పాహారం పంపిణీని ప్రారంభించనున్నది. నేటి నుంచి 34 రోజుల పాటు రాష్ట్రంలోని 4,785 స్కూళ్లలో 1,89,791 మంది విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని సర్కార్ నిర్ణయించిన మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొటీన్లు, ఐరన్, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్నే స్నాక్స్‌గా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్నాక్స్‌గా విద్యార్థులకు వేయించిన పల్లీలు, ఉడికించిన శనగలు, ఉడికించిన గుడ్లు, అరటిపండు, సమోసాలు, అటుకుల చుడువ, బెల్లం, సమోసాలు, పకోడి, బిస్కెట్ ప్యాకెట్ వంటివి అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.15 ఖ ర్చు చేయనున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకంలో కూడా పోషకాలుండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పూర్తిగా సొంత నిధులతో వారంలో మూడు రోజులు కోడిగుడ్డు, లేదా అరటిపండును అందజేస్తున్నది. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరో 36,154 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని సమకూరుస్తున్నది. రాగిజావ, లేత మొలకలు, బెల్లం, పల్లీపట్టి వంటి వాటిని సైతం పిల్లలకు అందజేస్తున్నారు.