తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పంచాయితీపై సుప్రీం కోర్టు తెగేసి చెప్పింది. ఎన్నికలపై తాము స్టే ఇవ్వలేమని, ఆ అధికారం కేవలం రాష్ట్ర హైకోర్టుకు ఉందని స్పష్టం చేసింది. ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీకోర్టు గురువారం విచారణ జరిపింది. తాము స్టే ఇవ్వలేమని, పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో బోగస్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, ముందస్తు వల్ల కొత్త ఓటర్లు ఓటు కోల్పోతారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి, శశాంక్ రెడ్డి తదితరులు వేసిన దావాలను సుప్రీం కోర్టు విచారించింది. తెలంగాణ ముందస్తు ఎన్నికలను సవాలు చేసిన అన్ని పిటిషన్లపైనా హైకోర్టు విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ రద్దయింది కనుక రాజ్యాంగ నిబంధనల ప్రకారం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం సూచించింది.
కాగా, ఓటర్ల జాబితా అనేది నిరంతర ప్రక్రియని.. హైకోర్టులోవేసిన పిటిషన్లను డిస్మిస్ చేశారని ఎన్నికల సంఘం న్యాయవాది కోర్టుకు తెలిపారు. తన పిటిషన్ కొట్టివేతపై శశిధర్ రెడ్డి స్పందిస్తూ.. బోగస్ ఓటర్ల వ్యవహారం తేలాకే ఎన్నికలు జరుగుతాయని తాను భావిస్తున్నానన్నారు. శుక్రవారం హైకోర్టులో దీనిపై గట్టి వాదనలు వినిపిస్తామని తెలిపారు. . తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.