ఏపీ ప్రభుత్వం పై కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు 2 లేఖలు రాశారు ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై కేసీఆర్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టం ప్రకారం బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని లేఖలో తెలుపుతూ.. 2 కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కేఆర్ఎంబీని కోరింది.
కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌ల ప్రతిపాదనపై మరో లేఖ రాశారు ఈఎన్సీ మురళీధర్. జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం… తాగునీటి అవసరాలు కాదని ఇతరత్రాలకు తరలింపు సరికాదని పేర్కొంది. పంప్డ్ స్టోరేజ్ స్కీమ్, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదని, అనుమతి లేని పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌లను పరిశీలించాలని కోరింది. సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతిలేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అన్ని పంప్డ్ స్టోరేజీ స్కీమ్‌లను మరోమారు పరిశీలించాలని కేఆర్ఎంబీని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు.