Telangana: Engineering Fee..Maximum Rs.1.73, Minimum Rs.35
mictv telugu

తెలంగాణ: ఇంజినీరింగ్ ఫీజు..గరిష్టంగా రూ.1.73, కనిష్టంగా రూ.35

July 21, 2022

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా ఇంజినీరింగ్ ఫీజులపై అధికారులు చర్చల మీద చర్చలు జరుపుతూనే ఉన్నారు. కోర్సుకు ఎంత ఫీజును కేటాయించాలి? కాలేజీలో ఏడాదికి గరిష్టంగా, కనిష్టంగా ఎంతెంత ఫీజు? అనే తదితర విషయాలపై బుధవారం అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో తీసుకున్న నిర్ణయాలను ఓ అధికారి వెల్లడించారు.

”రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎస్ఆర్సీ) చేపట్టిన విచారణ బుధవారంతో ముగిసింది. మొత్తం 175 కాలేజీలకుగానూ గరిష్టంగా సీబీఐటీ కాలేజీలో ఏడాదికి ఫీజు రూ.1.73 లక్షలు, కనిష్టంగా అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో రూ.35 వేలుగా టీఏఎస్ఆర్‌సీ నిర్ణయించింది. అన్ని కాలేజీల ఆడిట్ రిపోర్టులను పరిశీలించి ఈ ఫీజులు 2022-25 కాలానికి చెల్లుబాటు అవుతాయని తెలిపింది. సీబీఐటీ కాలేజీ రూ.2.16 లక్షలకు పెంచాలని కోరగా, టీఏఎస్ఆర్‌సీ అధికారులు రూ.1.73 లక్షల వరకు ఖరారు చేశారు” అని ఆయన అన్నారు.

అయితే, ఇది ప్రాథమిక నిర్ణయమేనని, మళ్లీ నెలాఖరులో మరోసారి సమావేశమై, ఫీజులపై తుది నిర్ణయం తీసుకొంటామని ఆ అధికారి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీటెక్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులు ఈ ఫీజుల విషయంలో నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క విధంగా ఫీజులు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి కాలేజీకి ఏడాది చొప్పున ఎంత ఫీజును చెల్లించాలి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని విద్యార్థులు కోరారు. ఈ క్రమంలో అధికారులు ఫీజుల విషయంలో చర్చలు జరిపి, ఓ నిర్ణయానికి వచ్చారు.