తెలంగాణలో రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ఈసెట్, ఎంసెట్ పరీక్షలను అధికారులు వాయిదా వేయనున్నట్లు సమాచారం. ఈ పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై నేడు ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. అనంతరం పరీక్షలకు నిర్వహణపై చర్చించి స్పష్టత ఇవ్వనున్నారు. అయితే, రాష్టవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులను చూస్తుంటే పరీక్షలను వాయిదా వేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు.
ఈసెట్, ఎంసెట్ పరీక్షలపై వర్షాల ప్రభావం పడనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18న ఈసెట్, 14 నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో ఈ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి అధికారులు పునరాలోచనలో పడ్డారు. పరీక్షలను యథాతథంగా నిర్వహించడమా, లేక వాయిదా వేయడమా అన్నది తేల్చుకోలేకపో తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి టీసీఎస్ అధికారులతో సమీక్షించారు. వరదలు పొంగి రోడ్లు తెగిపోయి, సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభిస్తేనే పరీక్షల నిర్వహణకు ఆటంకం కలుగుతున్నదని టీసీఎస్ వర్గాలు పేర్కొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ముసురే కురుస్తుండటంతో పరీక్షలను యథాతథంగా నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తం మీద సోమవారం నాటి వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.