ఇక్కడ మూత్రం పోయరాదు..పోస్తే జరిమానా.. అంటూ మనం బహిరంగ స్థలాల్లో బోర్డులు చూస్తాం. రూల్స్ బ్రేక్ చేసి ఎవరైనా మూత్రం పోస్తే జరిమానా విధిస్తారో లేదో తెలీదు కానీ.. ఓ ఎద్దు మూత్ర విసర్జన చేసిందని రైతుకు జరిమానా విధించిన ఆసక్తికర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయం ముందు ఎద్దు మూత్రంపోయడంతో అధికారులు రైతుకు జరిమానా విధించారు.
సుందర్ లాల్ లోధ్ ఒక రైతు తన కుటుంబంతో సహా కంపెనీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాడు. తన నుంచి తీసుకున్న భూమికి సింగరేణి కంపెనీ పరిహారం చెల్లించడం లేదంటూ అతడు తన ఎద్దుల బండితో పాటు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగాడు. అయితే ఆ జోడెద్దుల్లో ఒకటి సింగరేణి కార్యాలయం గేటు ఎదుట మూత్రం పోసింది. దాంతో సింగరేణి అధికారులు ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుందర్ లాల్, అతడి కుటుంబం తమ కార్యాలయం ఎదుట రభస సృష్టిస్తున్నారని, ఎద్దులతో మూత్రం పోయించి అపరిశుభ్రంగా మార్చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతును పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, ఆ రైతుకు రూ.100 జరిమానా విధించారు. ప్రజలు మూత్ర విసర్జన చేస్తుంటే ఎవరికీ జరిమానా విధించరు కానీ, ఇక్కడ ఎద్దు మూత్రం పోసిందని జరిమానా విధించారు అంటూ వారు విమర్శలు చేస్తున్నారు.