రైతు మృతిపై ఆందోళన.. యూరియా కొరతపై మంత్రి వివరణ..
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈ రోజు ఓ రైతు యూరియా కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో కన్నుమూశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మృతుణ్ని అచ్చుమాయపల్లికి చెందిన 65 ఏళ్ల ఎల్లయ్యగా గుర్తించారు. ఆయన రెండు రోజులుగా క్యూలో నిలబడినా ఫలితం లేకపోయిందని, పలువురు రైతులు ఎరువుల దుకాణాల వద్ద చేంతాడంత క్యూల్లో నిలబడుతూ అస్వతస్థతకు గురువుతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి విలేకర్ల సమావేశం పెట్టి వివరణ ఇచ్చారు.
ఎల్లయ్య మృతికి యూరియాతో సంబంధం లేదని, ఆయన చనిపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. ‘ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరగడంతో కొన్నిచోట్ల యూరియాకు కొరత ఏర్పడింది. తెలంగాణకు రావాల్సిన యూరియాను కర్ణాటకకు పంపారు. ఉత్తరప్రదేశ్, బిహార్‌లో వరదల వల్ల అక్కడి నుంచి రావాల్సిన లారీలు ఆలస్యంగా వచ్చాయియ. రాష్ట్రంలో యూరియా స్టాక్ సరిపడా ఉంది. రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు. అన్ని శాఖల అధికారులతో యూరియా సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించాం. కేంద్రం దశలవారీగా యూరియా సరఫరా చేస్తుంది. 8.5 లక్షల టన్నుల యూరియా కోరాం. కానీ ఇప్పటివరకు 2 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చారు. దీనికి మరికొన్ని సమస్యలు తోడయ్యాయి. కాకినాడలోని నాగార్జున యూరియా కంపెనీ మూతపడింది. విదేశాల నుంచి రావాల్సిన యూరియా కూడా రాలేదు. సమస్యలను పరిష్కరించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. రాజకీయ పార్టీలు రైతన్నలను ఆగం చేయొద్దు’ అని అన్నారు. దుబ్బాకలో యూరియకు కొరత లేదన్న మంత్రి.. ఎల్లయ్య కుటుంబానికి సాయం చేసే అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని వెల్లడించారు. ఎక్కడైనా యూరియాకు కొరత ఉందని తెలిస్తే అక్కడ స్టాకు పెంచుతామని హామీ ఇచ్చారు.